హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొరతతో దేశమంతా అతలాకుతలమైతే, ఏప్రిల్‌లో దక్షిణాది రాష్ర్టాల్లో ఆల్‌టైం అత్యధిక విద్యుత్తు డిమాండ్ 60,876 మెగావాట్లుగా నమోదైందని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ (ఎస్సార్పీసీ) చైర్పర్సన్, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. అంత డిమాండ్ ఉన్నా నాణ్యమైన విద్యుత్తును అన్ని వర్గాలకు అందించామని వెల్లడించారు. శనివారం బెంగళూరులో జరిగిన 42వ ఎస్సార్పీసీ సమావేశలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్తును అందించటం, గ్రిడ్‌ను కాపాడటంలో విజయవంతం కావడానికి క్రమశిక్షణే కారణమని తెలిపారు.
గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ తమిళనాడులో 17,563 మెగావాట్లు, కర్ణాటకలో 14,818, తెలంగాణలో 14,160, ఏపీలో 12,293, కేరళలో 4,385, పాండిచ్చేరిలో 467 మెగావాట్లకు చేరుకొన్నదని, అనేక అడ్డంకులు ఎదురైనా.. అదే స్థాయిలో విద్యుత్తు సరఫరా చేశామని వివరించారు. కరోనా ఉన్నా గత ఏడాది దక్షిణ ప్రాంతంలో అదనంగా 3,148 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించామని తెలిపారు. అదే సమయంలో 400 కేవీ 1,862 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లను ప్రారంభించుకొన్నామని చెప్పారు. పునరుత్పాదక శక్తి వనరులు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్-ఉత్పత్తిని సమన్వయం చేయటంలో సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. లోడ్-జనరేషన్‌ను సమన్వయం చేయటంతో పాటు ఆర్థిక నిర్వహణకు అత్యాధునిక ఆటోమేషన్ టెక్నిక్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
బొగ్గు బ్లెండింగ్ (విదేశీ బొగ్గు)పై నిర్ణయం తీసుకొనేటప్పుడు రాష్ర్టాల అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్రానికి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ర్టాల్లోని అనేక థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొతర నెలకొన్నదని, ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులోనూ నెలకొంటాయనే అంచనాలున్నాయని అన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) దృష్టికి తీసుకెళ్లామని, బొగ్గు సరఫరాదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తామని సీఈఏ హామీ ఇచ్చిందని వివరించారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు నిర్మాణాత్మక వ్యవస్థను రూపొందించుకోవాలని అన్నారు. సమావేశంలో సభ్య కార్యదర్శి అసిత్ సింగ్, దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.