హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల కాలేజీల్లోని ఇంట ర్ సీట్ల భర్తీకి ఈ నెల 31న(గురువారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. పూర్తి వివరాలను బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల సొసైటీ కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అడ్మిషన్లపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని ఖండించారు. పారదర్శకంగానే సీట్లను భర్తీ చేశామని స్పష్టంచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. వి ద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీపడబోమని స్పష్టంచేశారు. మహిళా సమాఖ్యలకు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్రీకృత ప్రొక్యూర్మెంట్ వల్ల లాభాలకంటే నష్టాలే అధికమని వెల్లడించారు. గురుకులాల్లో జరిగే అన్ని ఘటనలను ఫుడ్‌పాయిజన్‌తో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రత్యేక పరిస్థితులు కలిగిన పిల్లలను గుర్తించి సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఫీజులు పెంచకపోతే కాలేజీలను నడిపేదెలా? ; ఫీజులు పెంచాలన్ననిబంధనను పాటించరా..?
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఫీజులు పెంచకపోతే కాలేజీలను నడిపేదెలా..? అంటూ పలు కాలేజీల యాజమాన్యాలు సర్కారును ప్రశ్నించాయి. ప్రతి మూడేండ్లకు ఫీజులు సవరించాలన్న జీవోలున్నాయి. ఈ జీవోను ఎలా ఉల్లంఘిస్తారని వాదించాయి. ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పన కోసం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో తొలిసారి భేటీ అయ్యింది. పలు కాలేజీల యాజమాన్యాలతో నిపుణుల కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. తమిళనాడు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ సమావేశానికి హాజరై, తమ రాష్ట్రంలో అమలవుతున్న విధానాలపై వివరించారు. ఆరేండ్లల్లో తమ కాలేజీ ఫీజులు పెంచలేదని, ఇప్పుడు పెంచితే అభ్యంతరమేంటని ఓ కాలేజీ యాజమాన్యం అడిగినట్టు సమాచారం. ఫీజుల ఖరారుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలను అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీలో నిర్ణయానికి వచ్చారు. రెండు, మూడు వారాల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించి, గైడ్‌లైన్స్‌ను రూపొందించి టీఏఎఫ్ఆర్సీకి నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.