అయిజ, ఏప్రిల్ 16 : వడదెబ్బకు తనయుడు మృతిచెందగా.. పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి గుండెపోటుతో కుప్పకూలిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. అయిజ మండలం తూంకుంటకు చెందిన కుర్వ మల్లికార్జున్ (42) కుటుంబసభ్యులతో కలిసి గురువారం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలాడు.
వెంటనే అయిజకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకురాగా కండ్లెదుటే కన్నకొడుకు మృతిచెందడంతో శోకసంద్రంలో మునిగిన అతడి తల్లి రంగమ్మ(63) రోదిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇద్దరి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులకు ధైర్యంచెప్పారు.