హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించిన సోమిరెడ్డిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని తెలంగాణ మైనార్టీ ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండిపడింది. సుదీర్ఘకాలం వేతనాలను చెల్లించకుండా సర్కార్ నిర్లక్ష్యం చేయడం వల్లే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రాజమ్మద్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి సోమిరెడ్డి ఆరు నెలలుగా వేతనం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం కండ్లు తెరవాలని డిమాండ్ చేశారు.