హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్‌తోపాటు ఇతర సహజ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్న రాయితీల వివరాలు తెలపాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదని ఆగ్రహం వెల్లడించారు.
పీఎం కిసాన్, పీఎం సూర్యఘర్ వంటి పథకాలను వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ భూములనే కాకుండా పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ లాంటి పథకాల ద్వారా ప్రజలకు సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు. నిరుడు జూన్‌లో 4000 మెగావాట్ల కోసం అనుమతి ఇచ్చామని, ఆరునెలల తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేకపోవడంతో 3000 మెగావాట్లను రద్దు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఎంపీలు ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఆయన సూచించారు.