హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ మత్స్యకారులకు అధునాతన యంత్రాలను సమకూర్చేందుకు రాష్ట్ర మత్స్య సహకార సం ఘాల సమాఖ్య కసరత్తు చేస్తున్నది. చేపలు పట్టేందుకు తెప్పలు, పుట్టీల స్థానంలో సౌరశక్తితో నడిచే ఫిషింగ్ బోట్లను అందించేందుకు యోచిస్తున్నది. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సహకారాన్ని తీసుకొనున్నట్టు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. త్వరలోనే ఆ సంస్థ శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రత్యేకంగా చర్చించునున్నట్టు తెలిపారు. సోలార్ ఫిషింగ్ బోట్లపై హైదరాబాద్లోని బిట్స్ పిలానీ సంస్థలో పనిచేస్తున్న నిపుణులతో ఇటీవలే భేటీ అయిన రవీందర్.. తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి ప్రొఫెసర్లతో చర్చించారు.