హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మంగళవారం రాత పరీక్ష సజావుగా జరిగినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఉదయం పేపర్-1 పరీక్షకు 11,274 (56.90%) మంది అభ్యర్థులు, పేపర్-2 పరీక్షకు 11,499 (58.04%) మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషన్ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రెండు పరీక్షలకు తప్పనిసరిగా హాజరైతేనే, ఆ అభ్యర్థిని అర్హుడిగా పరిగణిస్తారు. ఒక్క పరీక్ష మాత్రమే రాస్తే ఆ అభ్యర్థిని అనర్హుడిగా భావిస్తున్నారు. పేపర్-1కు 11,274 మంది అభ్యర్థులు హాజరుకాగా, పేపర్-2 పరీక్షను 11,499 మంది అభ్యర్థులు రాశారు. దీంతో ఒక్క పరీక్ష మాత్రమే రాసిన 225 మంది ఆటోమెటిక్‌గా డిస్ క్వాలిఫై అయినట్టే.