జయశంకర్ భూపాలపల్లి, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేదని ఆ బరాజ్ ఈఈ యాదగిరి తెలిపారు. చిన్నచిన్న లోపాలను మరమ్మతులతో సరిదిద్దవచ్చని సూచించారు. బరాజ్ సీపేజ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నిర్మా ణ సంస్థ ఆప్కాన్స్ ఐదు రోజుల క్రితం ప్రారంభించగా రెండు సీపేజ్లలో పాలీ యూరిత్రిన్ కెమికల్‌తో గ్రౌటింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. పనులను చేపట్టిన ఆప్కాన్స్ నిపుణులు కొంత విరామం ఇచ్చి పరిశీలనలో ఉంచారు. గురువారం విజిలెన్స్ అడిషనల్ డీజీ రాజీవ్ రతన్ అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లను, కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 3వ ఫ్లోర్ నుంచి మోటర్లను పరిశీలించారు.
సరస్వతీ బరాజ్‌లో 38, 28వ ఔట్లెట్లో అక్టోబర్‌లో భారీ వర్షాలతో చిన్న చిన్న సీపేజ్‌లు ఏర్పడిన విషయాన్ని సరస్వతీ బరాజ్ ఈఈ యాదగిరి అడిషనల్ డీజీ రాజీవ్త్రన్కు వివరించారు. ప్రారంభంలోనే అప్రమత్తమై స్టోన్, మెటల్, ఇసుకతో తాత్కాలిక ట్రీట్మెం ట్ చేసి లీకేజీని అరికట్టామని, సీపేజ్ నుంచి ఇసుక బయటికి పోకుండా అడ్డుకున్నట్టు ఈఈ యాదగిరి ఏడీజీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పనులను చూసి ఏదో జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అంతా అయోమయానికి గురయ్యారని పేర్కొన్నారు. ఇటీవల మంత్రుల బృందం సైతం అన్నారం బరాజ్‌ను పరిశీలించి రెండు సీపేజ్లతో ప్రమాదమేమీ లేదని తేల్చిందని, నిర్మాణ సంస్థచే గ్రౌటింగ్ చేయించాలని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు, అధికారులు ఉన్నారు.