హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి తెలంగాణకు నిధుల్లేవు.. జాతీయ సంస్థలు లేవు.. సాగునీటి ప్రాజెక్టులు లేవు. న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను తేల్చటంలోనూ మోదీ సర్కారు తాత్సారం చేస్తున్నది. ఎస్ఎల్బీసీ నీటివాటాపై తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. మొత్తంగా తెలంగాణ అంటేనే కక్ష చూపుతున్నది. అదే.. కర్ణాటక అప్పర్‌భద్రకు అనుమతులు ఇచ్చి, జాతీయ హోదా ప్రకటించింది. 1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే, నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. అదీగాక ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున వాటాను కేటాయించింది.
ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన మాత్రమే పంచుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా నొక్కిచెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కాయి. ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటాను కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పటికే వినియోగించుకొంటున్నాయి. ట్రిబ్యునల్ కేటాయించిన 45 టీఎంసీల నికర జలాలను శ్రీశైలం ఎడమ గట్టుకాలువ(ఎస్ఎల్బీసీ)కు కేటాయించడంతో పాటు, ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే సిద్ధం చేసింది. దానిని సీడబ్ల్యూసీ అనుమతి కోసం 1985లోనే పంపింది. అప్పటికి పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు రానందున, ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాక నివేదించాలని డీపీఆర్‌ను తిప్పిపంపింది.
ఏడేండ్లుగా తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
ఏపీ పునర్విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదాను కల్పించడంతో 45 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణకు మార్గం సుగమమైంది. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయాన్ని కేంద్రానికి విన్నవిస్తూ వస్తున్నారు. నీటి వినియోగానికి అనుమతులివ్వాలని కోరుతున్నారు. ప్రధాని మోదీని, జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసిన ప్రతిసారి నీటివాటా అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కేఆర్ఎంబీకి సైతం సాగునీటి పారుదలశాఖ పలుమార్లు లేఖలు రాసింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇదే అంశంపై తెలంగాణ సర్కారు వాదనలు వినిపిస్తున్నది. ఎస్ఎల్బీసీకి నికర జలాలు కేటాయించాలని పట్టుబడుతున్నది.
కేంద్రం తాత్సారం
గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు సైతం అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. ట్రిబ్యునల్ అవార్డు గోదావరి నదికి సంబంధించినదని, దాన్ని జీఆర్ఎంబీనే పరిష్కరించాలని కేఆర్ఎంబీ ఒకవైపు, అవార్డు అమలు కావాల్సింది కృష్ణా బేసిన్లో కాబట్టి కేఆర్ఎంబీనే బాధ్యత వహిస్తుందని జీఆర్ఎంబీ చెప్తూ కప్పదాటు పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, నెత్తీనోరు కొట్టుకుంటే చివరకు బజాజ్ కమిటీని వేసి చేతులు దులుపుకొన్నది. సమస్య పరిష్కారం కాకముందే ఆ కమిటీ గడువు ముగిసిపోయింది. దాన్ని కేంద్రం పొడగించలేదు. నీటి వినియోగానికీ అనుమతి ఇవ్వటం లేదు. కేంద్ర విధానంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.