ములుగు, ఆగస్టు 20 (నమస్తేతెలంగాణ): మంత్రి సీతక్క అనుచరుడు ఇసుక రీచ్‌ల వద్ద హల్చల్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు అతడిని నిలదీశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి.. ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక లోడింగ్ చేస్తానంటూ డబ్బులు తీసుకొని చేయకపోవడంతో లారీ డ్రైవర్లు తిరగబడ్డారు. పది రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలంలోని వీరభద్రాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఓ లారీ డ్రైవర్ వీడి యో తీసి పోస్టు చేయడంతో మంగళవారం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై ఓ లారీ డ్రైవర్ ఫోన్లో స్పందిస్తూ.. శ్రీనివాస్‌రెడ్డితో వాగ్వాదం జరిగింది వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇసుక లోడింగ్ కోసం ఒక్కో లారీకి రూ.4,500 చెల్లించామని, అయినప్పటికి లోడింగ్ విషయంలో ఆలస్యం జరగడంతో తాము నిలదీసినట్టు చెప్పారు.
ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్లను దుర్భాషలాడగా తామంతా లారీలను నిలిపివేసి అక్కడే రోడ్డుపై ధర్నా కూడా చేశామని తెలిపారు. ఇది జరిగిన మరుసటి రోజు లారీల్లో ఇసుక లోడ్ చేసి పంపించారని వివరించారు. కాగా, ఈ వీడియోపై సదరు కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా మంగళవారం రాత్రి స్పందించారు. ‘ఈ ఘటనకు మంత్రి సీతక్కతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా బతుకుదెరువు కోసం ఇసుక క్వారీ యజమాని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నా. ఇసుక లారీలను క్రమ పద్ధతిలో లోడింగ్ చేసే క్రమంలో జరిగిన గొడవను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా కొందరు వైరల్ చేశారు. వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా’నని తెలిపారు. లారీ డ్రైవర్లు రోడ్డెక్కి ధర్నా చేసినా, లారీలను ఆపినా ఈ వ్యవహారం బయటకు పొక్కక పోవడంలో అధికారులు పాత్ర ఉందా? లేక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.