Singareni | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్టు తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందుతుందని చెప్పారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఎన్ బలరామ్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వర్తించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు వారు పనిచేస్తున్న గని, శాఖ ఆధారంగా బోనస్ చెల్లిస్తారు. ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో బోనస్ లభిస్తుంది. భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ.749.58 చొప్పున వారు పనిచేసిన మొత్తం రోజులకు లెక్కగట్టి చెల్లిస్తారు. ఓపెన్‌కాస్ట్ గనులు, ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రూ.627.41 చొప్పున, మిగిలిన విభాగాలు, శాఖల్లో పనిచేసేవారికి రోజుకు రూ.578.69 చొప్పున అందేస్తారు. మొత్తం మీద ఒక్కో కార్మికునికి సగటున రూ.1,53,516 వరకు బోనస్ పొందే అవకాశం ఉన్నది. దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీం బోనస్)ను కూడా ఆ పండుగకు ముందే చెల్లిస్తామని శ్రీధర్ ప్రకటించారు.
ఈ మొత్తం సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సగటున ఒక్కో కార్మికుడు రూ.76,500కి పైగా పొందే అవకాశం ఉన్నది. ఇటీవల చెల్లించిన వేజ్‌బోర్డ్ బకాయిలు రూ.1,450 కోట్లలో ఒక్కో కార్మికుడికి సగటున రూ.3.65 లక్షలు, ఇప్పుడు చెల్లిస్తున్న దసరా బోనస్, ఆపై చెల్లించే దీపావళి బోనస్ కలుపుకొని ఈ సంవత్సరం ఒక్కొక్కరికి సగటున రూ.6 లక్షల వరకు వారి ఖాతాల్లో జమ అవుతాయి. ఇది కార్మికుల కష్టార్జితం కనుక భవిష్యత్తు అవసరాలకు దాచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఇదే స్ఫూర్తితో కష్టపడితే ఈ ఏడాది 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని, తద్వారా రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉంటుందని, దీనితో మరింత లాభాల వాటా లభిస్తుందని శ్రీధర్ పేర్కొన్నారు.
భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ.749.58
ఓపెన్‌కాస్ట్ గనులు, ఇతర సర్ఫేస్ శాఖలు రూ.627.41
ఇతర విభాగాలు, శాఖల్లో పనిచేసేవారికి రూ.578.69