నమస్తే నెట్వర్క్ జూన్ 3: సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగరేణి ఏరియాల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణిలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సింగరేణివ్యాప్తంగా 40నుంచి 50లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, లేని బొగ్గుకు ఐటీ, సీఎస్ఆర్ యాజమాన్యం చెల్లించిందని మండిపడ్డారు. సింగరేణికి విద్యుత్తు పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.54వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, అవి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. దీంతో కార్మికులకు జీతాలు చెల్లించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. అనంతరం గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు.