హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏకకాలంలో ఓ మహిళకు 12 కిలోల కాలేయం తొలిగించడంతో పాటు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను కిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఉషా అగర్వాల్ (50) కొంతకాలం నుంచి పాలీసిస్టిక్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. ఆమె కాలే యం రోజురోజుకూ పెరుగడమే కాకుండా కిడ్నీ సైతం దెబ్బతిన్నది. కాలేయం పెరిగి ఉదర భాగాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నదని, దీనివల్ల హెర్నియా ఏర్పడి పగిలిపోయిందని కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన సర్జన్ డాక్టర్ రవిచందర్ సిద్ధాచారి తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే యూరాలజిస్టులతో కలిసి 14 గంటల పాటు శ్రమించి ఏకకాలంలో కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపినట్టు పేర్కొన్నారు. మహిళ నుంచి తొలగించిన కాలేయం బరువు 12 కిలోలు ఉన్నట్టు వెల్లడించారు. ఇలాంటి సర్జరీ దేశంలోనే తొలిసారి అని తెలిపారు.