హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): బాడీగార్డులుగా ఇద్దరు మాజీ సైనికులు.. వారి చేతిలో వాకీటాకీలు.. పోలీస్ సైరన్‌తో వాహనం.. ఆ హంగామా చూస్తే అతడు పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారి అని నమ్మాల్సిందే. షేక్‌పేట్‌లో శశికాంత్ ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ.. తాను ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారినని చెప్పుకుంటూ ఎంతోమందిని మోసగించాడు. రెండేండ్లుగా అతడు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నా నిఘా విభాగం గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్‌నగర్ పోలీసులు ఈ ఘరానా కేటుగాడిని అరెస్టు చేయగా, ఏసీ గార్డ్స్‌లోని డీసీపీ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ సీ హెచ్ శ్రీనివాస్ బుధవారం ఆ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఉమ్మడి కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్(39) త్రీడీ యా నిమేషన్ కోర్సు చేసి ఒక చిన్న కంపెనీ నెలకొల్పాడు. కొంతకాలం చంపాపేటలో ఉండి ఇటీవల షేక్‌పేట్‌లోని అ పర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌కు మకాం మార్చాడు. తమిళనాడుకు చెందిన విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్‌ను గన్మెన్లుగా నియమించుకున్నాడు. శశికాంత్‌కు సైరన్ అమర్చిన కారు, వాకీటాకీలు కూడా ఉన్నాయి. తన పేరిట నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారుల గుర్తింపు కార్డులు తయారు చేశాడు.
పోలీసు, ఎన్ఐఏలో ప్రత్యేక ఆపరేషన్ల కోసం తనను ప్రభుత్వం నియమించిందంటూ పలువురిని నమ్మించాడు. తాను టీఎస్ఐఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌నని, ఖాళీ స్థలాలు కేటాయించే విభాగానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారినని జిమ్ యజమాని అలీ హసన్‌కు చెప్పాడు. పరిశ్రమ స్థాపన కోసం స్థలం కేటాయిస్తూ ఓ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారుచేసి అలీ హసన్‌కు చూపించి రూ.10.50 లక్షల నగదు తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇదే విధంగా జిమ్‌కు వచ్చే మరో వ్యక్తి నుంచి కూడా రూ.10లక్షలు వసూలు చేశాడు. కేటాయింపు జరిగిందని చూపించిన స్థలం తన పేరు మీద బదిలీ కాకపోవడంతో అలీహసన్కు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడు శశికాంత్‌ను అరెస్ట్ చేసి రెండు మొబైల్స్, ఆరు సిమ్‌కార్డులు, వాకీటాకీలు, నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారుల గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ అధికారి శశికాంత్ నగరంలోని బిల్డర్లను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తన దందాలు కొనసాగించేవాడు. తాను డిప్యూటీ కమిషనర్(మైన్స్), స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ పలువురు వ్యాపారుల వద్ద భారీగా మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ రోలెక్స్ భలే భలే..ఖరీదైన గడియారంపై చర్చ..
ఓ నిందితుడి నుంచి జప్తు చేసిన సొమ్మును పంచుకోవడంలో వాటాలు కుదరక గల్లాలు పట్టుకున్న పోలీసుల వ్యవహారం కమిషనరేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. షేక్‌పేటలో మంగళవారం సాయంత్రం ఓ నకిలీ ఐఏఎస్ అధికారి శశికాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్దనున్న వ స్తువులు చూసి షాక్ అయ్యారు. శశికాంత్ సంపాదించిన వాటిలో అనేక విలువైన వస్తువులు కనిపించాయి. వాటిలో పోలీసులను ఓ రోలెక్స్ వాచ్ బాగా ఆకర్షించింది. సుమారు రూ.25 లక్షల విలువైన ఆ వా చ్‌ను పెద్ద సారుకు ఇచ్చేస్తే.. ఆయన ఖుషీ అవుతారని భావించాడు. ఆ తరువాత వారంతా ఒకచోటకు చేరి వాటాలు పంచుకునే సమయంలో పంచాయితీ మొదలై.. గల్లాగల్లాలు పట్టుకున్నారని తెలిసింది.