హైదరాబాద్ : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే సమస్య పరిష్కరించాలని గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు.
దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే హాస్టల్ గదుల్లో నీళ్లు లేకపోవడంతో ఆరుబయటే విద్యార్థులు స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని.. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.