Telangana | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తున్నది. రాబోయే ఐదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేరొన్నది. జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో కనిష్ఠంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 9.6, మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్, మిగితా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 11.6 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీర్ఘకాలిక రోగాల తో బాధపడేవారు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అటకెక్కిన బేబీకేర్ సెంటర్ల ఏర్పాటు!
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్ పిల్లల సంరక్షణకు బేబీకేర్ సెంటర్లు ఏర్పాటుచేయాల్సి ఉన్నది. ముఖ్యంగా కుటుంబ పోషణ కోసం పనికి వెళ్లేవారి పిల్లల సంరక్షణకు వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 33 శిశు సంరక్షణ సెంటర్ల ఏర్పాటు కోసం నిధులూ విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ నిధులు ఆర్థికశాఖ వద్దే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. సెంటర్ల ఏర్పాటుపై కేంద్రం ఆదేశాలు ఇచ్చి ఏడాది దాటినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటి ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెంటర్లలో ముందుగానే టీచర్లు, ఆయాల నియామకం జరగాల్సి ఉంది. కానీ, వారికిచ్చే వేతనాలు తక్కువగా ఉండడంతో ఎవరూ ముందుకురాని పరిస్థితి. సంబంధిత అధికారులు మాత్రం నెలరోజుల్లో వీటిని ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య ఈ పథకం ముందుకెళ్తుందా? లేక అటకెక్కిస్తారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్కింగ్ ఉమెన్స్ మాత్రం ఇప్పటికైనా ఈ సెంటర్లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.