హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఐఎన్‌ఏఈ) ఫెలోషిప్‌ను అందుకొన్నారు.
దేశీయ క్షిపణి వ్యవస్థల తయారీ, నాణ్యత, వ్యయ ప్రభావాన్ని మెరుగుపరచడానికి, ఎంఎస్ఎంఈ రంగానికి అపారమైన వ్యాపార సామర్థ్యాన్ని పెంపునకు అవసరమైన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన విశేషమైన సేవలను అందిస్తున్నారు.
“నేషనల్ మెటీరియల్ పాలసీ” రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. భువనేశ్వర్‌లో సోమవారం నిర్వహించిన వార్షిక సమావేశంలో ఐఎన్‌ఏఈ ప్రెసిడెంట్ ఇంద్రనీల్ మన్నా చేతులమీదుగా జోషి ఈ ఫెలోషిప్‌ను అందుకొన్నారు. జోషికి ఐఎన్‌ఏఈ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ జి మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.