శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 19:15:54

దుబ్బాక ఉప ఎన్నిక‌.. బందోబ‌స్తు ఏర్పాటు పూర్తి : జోయ‌ల్ డేవీస్

దుబ్బాక ఉప ఎన్నిక‌.. బందోబ‌స్తు ఏర్పాటు పూర్తి : జోయ‌ల్ డేవీస్

సిద్దిపేట : న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగే దుబ్బాక ఉపఎన్నిక‌కు బందోబ‌స్తు ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయ‌ల్ డేవీస్ తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జోయ‌ల్ డేవీస్ పాల్గొని ఉప ఎన్నిక‌కు సంబంధించిన‌ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేంద్ర పారా మిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. అధునాతన సాంకేతికత‌ను ఉపయోగించి ఎన్నికలు నిర్వహ‌ణ జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. జిల్లా అధికారులతో సమన్వయంతో చేసుకుంటూ ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింద‌న్నారు.  

మొబైల్ పార్టీలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, పోస్ట్ పోల్ టీమ్స్, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ లలోని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. జీపీఎస్ లోకేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను మొబైల్ పార్టీలను మానిటర్ చేయడం జరుగుతుందని ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 2 వేల మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు లేని వారందరూ న‌వంబ‌ర్‌ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లు, హోటళ్లు, లాడ్జిలపై నిఘా ఉంచిన‌ట్లు ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. జియో ట్యాగింగ్, వెబ్ కాస్టింగ్ వల్ల ఏ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అక్కడ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు నేరుగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల పోలింగ్ కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని తగు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.