హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల కిందటి తీర్పు అమలు చేయని ప్రతివాది శ్రీతేజ బెనిఫిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ బీ హరికృష్ణకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ రెండో వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. శిక్ష అమలు నిలిపివేత ఉత్తర్వుల కోసం నెల రోజులు వాయిదా వేసినా ఎలాంటి ఉత్తర్వులు దాఖలు చేయనందున హరికృష్ణను జైలుకు పంపుతూ కమిషన్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. సైదాబాద్కాలనీకి చెందిన నూగూరు మేనక శ్రీతేజ బెనిఫిట్ ఫండ్లో పొదుపు చేశారు. మెచ్యూరిటీ సమయం దాటినా పొదుపు మొత్తాన్ని చెల్లించకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ రెండో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. రూ.8లక్షల 25 వేల పరిహారంతోపాటు రూ.5వేల ఖర్చులు చెల్లించాలని 2018 జూన్ 6న జిల్లా కమిషన్ తీర్పు చెప్పింది. కొంత సొమ్ము చెల్లించిన ప్రతివాది, ఆ తర్వాత మొండికేయడంతో తిరిగి విచారణ కొనసాగింది. వాదనల అనంతరం ఆరు నెలల జైలు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.