హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో బౌద్ధ మహా సమ్మేళనం సోమవారం జరుగనున్నది. తెలంగాణ గత చరిత్ర, వారసత్వాన్ని తెలిపేలా బాలాంరాయ్లోని క్లాసిక్ గార్డెన్లో మహా సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలి బౌద్ధ మహా సమ్మేళనం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో 2014లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బౌద్ధ సంఘాల నాయకులు, బౌద్ధ భిక్షువులు (బిక్కులు) హాజరవుతారని సమ్మేళనం నిర్వాహకులు ఎస్ వరున్‌కుమార్, జీ పరందాములు, నూకల నరసింహ, శీలం ప్రభాకర్, బీ సత్తయ్య, తోకల సంజీవ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. సుమారు మూడు వేల మందితో మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడు భీంరావు అంబేద్కర్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ప్రాచీనకాలంలో తెలంగాణ ప్రాంతంలో హిందూమతం తర్వాత అత్యంత ప్రజాదరణ పొంది ధర్మం బౌద్ధమే. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బౌద్ధానికి చెందిన ఆరామాలు, విహారాల శిథిలాలు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. నాగార్జునసాగర్‌లో 274 ఎకరాలను కేటాయించి బుద్ధవనాన్ని నిర్మించింది. ఇందులో ప్రపంచం నలుమూలల్లో ఉన్న బౌద్ధ కట్టడాల నమూనాలతోపాటు బుద్ధుడి జననం నుంచి మహాపరి నిర్యాణం వరకు అన్ని ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను చూడొచ్చు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బౌద్ధ ధర్మ అవశేషాలు ఉన్నాయి. బౌద్ధం తన మునుపటి వైభవాన్ని తెలంగాణలో సంతరించుకోనున్నది. నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం అద్భుతమైన బుద్ధవనం నిర్మించింది. మహా సమ్మేళనం తర్వాత జాతీయ బౌద్ధ మహాసభ కమిటీ సభ్యులందరూ బుద్ధవనాన్ని సందర్శిస్తారు.
– ఎస్ వరుణ్‌కుమార్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి
ప్రపంచ ప్రసిద్ధ తక్షశిల, బుద్ధగయల మాదిరిగా నాగార్జునసాగర్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధిచేయాలన్న లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం వల్ల నెరవేరింది. ఉమ్మడి ప్రభుత్వం బుద్ధవనం నిర్మించాలనుకొన్నా ముందుకు సాగలేదు. స్వరాష్ట్రంలో 2015లో తిగిరి ఈ ప్రాజెక్టు ఊపిరి పోసుకొని ప్రస్తుతం పూర్తయ్యింది కూడా. అంతర్జాతీయ బౌద్ధ వేదికలపై తెలంగాణలోని నందికొండ నిలువటం గొప్ప అనుభూతినిస్తున్నది.
– తోకల సంజీవరెడ్డి, బుద్ధిస్టు