దండేపల్లి, జూన్ 18 : పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని, లేదంటే మరణమే శరణ్యమని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ పాఠశాల ఎస్ఎంసీ మాజీ చైర్పర్సన్ గడికొప్పుల విజయ, ఆమె భర్త తిరుపతి తెలిపారు. బుధవారం వారు పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు.
గ్రామానికి చెందిన గుత్తేదారు, ఎస్ఎంసీ మాజీ చైర్పర్సన్ విజయ, ఆమె భర్త తిరుపతి వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ పథకంతో పాటు, ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో నూతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, వాటర్ సంపు, విద్యుత్తు మరమ్మతులు, ప్రహరీ పనులు చేపట్టారు.
ఇందుకోసం సుమారు రూ.28 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు రూ.5 లక్షల బిల్లే వచ్చిందని, ఇంకా రూ.23 లక్షలు రావాల్సి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని, చేసేదేమి లేక పాఠశాల గేటుకు తాళం వేసి ఆందోళన చేసినట్టు తెలిపారు. ఆందోళన చేస్తున్న సమయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.