హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో గుణాత్మక మార్పు కోసం పలు సంస్కరణలు చేపడుతున్న విద్యాశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతి నెల 4 నుంచి 7 వరకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించింది. 50శాతం టీచర్ల చొప్పున ఈ సమావేశాలకు హాజరుకావాలని సూచించింది. తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య వంటి కార్యక్రమాల అమలుపై చర్చించాలని ఆదేశించింది. ఇది వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అరకొరగా ఉండేవని, ఇక నుంచి పటిష్ఠంగా నిర్వహించాలని తెలిపింది. ఆయా సమావేశపు ఎజెండాను కూడా విద్యాశాఖ ఖరారు చేసింది.