DSC Sports Quota | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఒక్కో టీచర్ పోస్టును రూ. 15 లక్షలకు అమ్ముకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి, అనర్హులకు ఉద్యోగాలిచ్చారని అంటున్నారు. ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. స్పోర్ట్స్ కోటా అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జోరు తిరుపతి బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టిన ఉదంతంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని 43 పేజీల అధారాలతో ఫిర్యాదు చేశారు. పరిశీలించిన లోకాయుక్త విచారణకు అనుమతించింది. డీఎస్సీ-2024లో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో లంచాలు పుచ్చుకున్న కొందరు అధికారులు అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని అభ్యర్థులు ఆరోపణలు చేశారు. దీంతో మూడుసార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అయినా ఇప్పటి వరకు ఏదీ తేల్చలేదు. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు రీ వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై నాలుగు నెలలుగా అధికారులు నాన్చుతున్నారు. ఈ విషయంపై స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికను విద్యాశాఖ తిప్పిపంపించింది. అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ మళ్లీ స్పోర్ట్స్ అథారిటీకే పంపించింది. ఇలా అధికారులు ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటూ అన్యాయం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఉద్యోగాలు పొందినవారిని కాపాడేందుకే ఇలా ఆరు నెలలుగా నాన్చుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పోర్ట్స్, విద్యాశాఖ అధికారులపై చర్చలు తీసుకోవాలని బాధితులు లోకాయుక్తకు ఫిర్యాదుచేశారు.