DSC Sports Quota | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : అత్యంత వేగంగా డీఎస్సీ నియామకాలు పూర్తిచేశాం. 10వేలకు పైగా టీచర్ ఉద్యోగాలిచ్చాం. ఇవీ రాష్ట్రప్రభుత్వ పెద్దలు చెప్పే గొప్పలు. కానీ ఇదే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రెండు శాఖల పెద్దలు నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ కుంభకోణంలో ఏ పెద్దల ప్రమేయముందో తేలాలంటే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టులుండగా, ఆ క్యాటగిరీలో 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ క్యాటగిరీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించింది. అక్టోబర్‌లో మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. కోటాలోని 95 పోస్టులకు 33 మందికి ఉద్యోగాలిచ్చారు. మిగిలిన 62 పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లించారు. కానీ పోస్టులివ్వడంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో నవంబర్ 20, 21, 22 తేదీల్లో కిందిస్థాయి అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించారు. జనవరి 3,4న ఉన్నతాధికారులు మళ్లీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. మూడు సార్లు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినా ఒక్క నివేదికనూ బయటపెట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పోస్టింగ్‌కు ఎంపిక చేయాలంటే ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ కలిసి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులను పక్కనపెట్టి, జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారని చెప్తున్నారు. ఇదే విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని, వారి పాత్ర కూడా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.