మహబూబ్నగర్ కలెక్టరేట్, డిసెంబర్ 31 : ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు నిర్వహించిన విచారణలో 160కిపైగా అభ్యర్థనలు అందాయని ఎస్సీ కులాల విచారణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ షమీమ్ అక్తర్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనంలో భాగంగా మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ విచారణలో అందిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు, చారిత్రక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో విచారణ జరిపినట్టు తెలిపారు. అనంతరం ఆయన పాత పాలమూరులోని దళితవాడలో అధికారులతో కలిసి పర్యటించారు. వసతుల కల్పన, మౌలిక సౌకర్యాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు, అధికారులు ఉన్నారు.