TG Highcourt | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసు పంపినట్టు సమాచారం. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 1965 జూలై 7న జస్టిస్ ఏకే సింగ్ జన్మించారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
2012లో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ నుంచి 2023 ఫిబ్రవరివరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ అలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన నాటి నుంచి తెలంగాణ హైకోర్టు సీజే పోస్టు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజయ్‌పాల్‌ను కోల్‌కతాకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసులపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.