ముత్తారం, ఫిబ్రవరి 14 : ‘దుమ్ము, ధూళీ లేవకుండా రోడ్డుపై నీరు చల్లించండి మహాప్రభో.. ఇంట్లో ఉండలేకపోతున్నాం’ అంటూ రోడ్డుపై మంచం వేసి పడుకొని ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి పంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి, జిల్లెలపల్లి గ్రామాల్లో తాడిచర్ల బ్లాక్-1, 2 ఇసుక క్వారీ నుంచి నిత్యం వందలాది లారీలతో ఇసుకను తరలిస్తుండటంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని రంగయ్యపల్లికి చెందిన కర్రె రాంచంద్రం ఆవేదన చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం రోడ్డుపై మంచం వేసుకొని పడుకొని ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని నిరసన తెలిపాడు. దుమ్ము, ధూళీ తాగే నీరు, తినే అన్నంలో పడుతున్నదని, శ్వాసకోస సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. అధికారులు స్పందించి రోడ్డుపై నీటిని చల్లించి.. ఇసుక క్వారీలను పూర్తిగా నిలిపివేయాలని కోరాడు.