హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)ని సందర్శించే వారికి సరికొత్త అనుభూతిని కల్పించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. సఫారీ రైడ్లను సందర్శకులు ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఓపెన్‌టాప్ వాహనాలు ప్రవేశపెట్టింది. ట్రీటాప్ కాటేజీ, మట్టి ఇల్లు సహా బస చేసేందుకు అధునాతన సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించింది. వీటిని జనవరి 10న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నది. సఫారీ రైడ్లను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న 6 వాహనాలకు అదనంగా 8 వాహనాలను సమకూర్చారు. మన్ననూరులోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్లో ఆరు కాటేజీలను నిర్మిస్తున్నారు.
సఫారీ రైడ్లకు మరింత డిమాండ్
అడవి జంతువులను వీక్షించేందుకు ఏటీఆర్‌లో అటవీశాఖ ప్రవేశపెట్టిన వాహనాలకు డిమాండ్ మరింత పెరుగుతున్నది. దీంతో అధికారులు మరో రెండు సఫారీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఉమామహేశ్వరం ఆలయం చివర, కొల్లం నుంచి రెండు కొత్త మార్గాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సందర్శకులను ఫర్హాబాద్ గేటు ద్వారా అడవిలోకి తీసుకెళ్లి గుండం గేటు ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. మొత్తం రైడ్ సుమారు 50 కిలోమీటర్లు. 3 గంటల సఫారీలో సందర్శకులు చెంచుల గుడిసెలు, వారి జీవనశైలి చూసే అవకాశం ఉంటుంది. అమ్రాబాద్తోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సఫారీ రైడ్లు నిర్వహించేందుకు 5 ఓపెన్‌టాప్ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.