బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 02:02:12

ఇంటిముందుకే రైతుబజార్‌

ఇంటిముందుకే రైతుబజార్‌

  • 109 చోట్ల్ల 63 వాహనాలతో కూరగాయల అమ్మకం 
  • వారాంతపు సంత యథాతథం
  • మార్కెటింగ్‌శాఖ నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలకు కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ఇండ్లవద్దనే రైతుబజార్లు నిర్వహించేలా  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌లో 109 ప్రాంతాల్లో 63 వాహనాలతో మొబైల్‌ రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కూరగాయలు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఈ వాహనాల ద్వారా బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకు వెళ్లి కూరగాయలను విక్రయిస్తారు. గురువారం బీఆర్కే భవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌, రోడ్డు-రవాణా, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో కూడిన ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సమీక్షా నిర్వహించారు. 

వారాంతపు సంతలను కొనసాగించాలని నిర్ణయించారు. రద్దీగా ఉన్న రైతుబజార్లను  సమీపంలోని ఖాళీ ప్రదేశాలకు తరలించనున్నట్టు జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచే మొబైల్‌ రైతు బజార్లు అందుబాటులోకి వచ్చాయని, వీటిసంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. కూరగాయల వాహనాల డ్రైవర్లకు, రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీచేయాలని డీజీపీని కోరినట్టు తెలిపారు.  హైదరాబాద్‌ ప్రజలకు రోజుకు 20 వేల క్వింటాళ్ల కూరగాయలు అవసరం కాగా.. గురువారం  వివిధ మార్కెట్లకు 21,954 క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయని, కొరతలేదని స్పష్టంచేశారు.

 సమన్వయంతో పనిచేయాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి 

కరోనా నేపథ్యంలో వైరస్‌ ప్రబలకుండా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మార్కెట్లలో రద్దీని నివారించేందుకు ఇంటివద్దకే రైతుబజార్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. నిత్యావసరాల సరఫరాకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల వెసులుబాటు కల్పించామని, ఎక్కడ ఇబ్బందులున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్లు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. 


logo