సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:34:58

500కే కరోనా పరీక్ష!

500కే కరోనా పరీక్ష!

  • ఆర్టీపీసీఆర్‌ ధరల తగ్గింపు
  • ల్యాబ్‌లు,దవాఖానలకువర్తింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దగ్గు, సర్ది, జ్వరంతో బాధపడుతున్నారా? కరోనా అని అనుమానిస్తున్నారా..? నిర్ధారణ పరీక్షకు ప్రైవేటులో ఎక్కువ ఖర్చవుతుందని ఆందోళన చెం దుతున్నారా? అయితే ఇక బాధపడాల్సిన పనిలేదు. ప్రైవేటు ల్యాబొరేటరీలు, దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. రూ.500కే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయాలని నిర్ణయించింది. నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబొరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) అనుమతి పొందిన ల్యాబ్‌లలో ఇకపై తగ్గించిన ధరలకే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో కొవిడ్‌ నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లు రూ.850 (ల్యాబ్‌లో), రూ.1200 (ఇంటి వద్ద) వసూలుచేస్తున్నాయి. తగ్గించిన ధరల ప్రకారం.. ల్యాబ్‌లో రూ.500, ఇంటి వద్ద రూ.750 వసూలు చేయాల్సి ఉంటుంది. కరోనా నిర్ధారణ పరీక్షల గరిష్ఠ ధరలను తొలిసారి ప్రభుత్వం జూన్‌లో నిర్ణయించింది. ఈ ధరలను నవంబర్‌ నెలలో తగ్గించగా, ఇప్పుడు రెండోసారి తగ్గించింది. ప్రైవేటులో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధరలు గతంతో పోలిస్తే నాలుగోవంతు కంటే తక్కువకు చేరుకున్నాయి.  దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తి పెరుగటం, ధరలు తగ్గటంతో పరీక్షలు నిర్వహణకయ్యే ఖర్చు సైతం తగ్గింది. దీని ప్రకారం, ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.  

పరీక్షల సంఖ్య పెంచేందుకే 

కొవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచేందుకు ధరలు తగ్గించినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకవైపు ప్రభుత్వం తరుఫున ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేసుకోవాలనుకొనేవారికి భారం కాకుండా సర్కారు నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్‌ విజృంభించిన తొలిరోజుల్లోనే ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా 19 ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలు, 1,076 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేసి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 19 ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలు, ప్రైవేటులో 56 ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 65 లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించింది.

ప్రైవేటు ల్యాబ్‌, దవాఖానల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధరలు..

  • జూన్‌లో ల్యాబ్‌లో రూ.2,200..
  • ఇంటి వద్ద చేస్తే రూ.2,600
  • నవంబర్‌లో ల్యాబ్‌లో రూ.850..
  • ఇంటి వద్ద చేస్తే రూ.1200
  • ప్రస్తుతం ల్యాబ్‌లో రూ.500.. 
  • ఇంటి వద్ద చేస్తే రూ.750

కొత్త కేసులు 617.. డిశ్చార్జి 635

 రాష్ట్రంలో కరోనా బారినపడిన వారిసంఖ్య 2.82 లక్షలకు చేరుకున్నది. వీరిలో 2.74 లక్షల మంది కోలుకోగా 1,518 మంది మరణించారు. సోమవారం 617 మందికి కొత్తగా కరోనా సోకగా, 635 మంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులిటెన్‌లో పేర్కొన్నది. రికవరీ రేటు జాతీయ సగటు 95.6 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 97.13శాతంగా నమోదైంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 45వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  


logo