హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ వినియోగదారులకు ఇచ్చే రివర్స్ ఇన్సెంటివ్ రద్దుకు రంగం సిద్ధమవుతున్నది. అదనపు విద్యుత్తును సరఫరా చేసినందుకు వినియోగదారులకు అందించే ప్రోత్సాహకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే డిస్కంలకు మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడంతో అవి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను ఈఆర్సీ ముందుంచేందుకు డిస్కం లు రెడీ అవుతున్నాయి. ఈ నెల 30లోపు డిస్కంలు ఈ నివేదికను ఈఆర్సీ ముందుంచాల్సి ఉన్నది. అందులో రివర్స్ ఇన్సెంటివ్ రద్దుకు డిస్కంలు ప్రతిపాదించనున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో దాదాపు కోటి మంది విద్యుత్తు వినియోగదారులున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వారిలో దాదాపు 30 వేల మంది రూఫ్ టాప్ సోలార్ పాంట్లను ఏర్పాటు చేసుకుని డిస్కంలకు అదనపు విద్యుత్తును సరఫరా చేస్తూ రివర్స్ ఇన్సెంటివ్ను పొందుతున్నారు. ఇన్సెంటివ్ రద్దుతో ఈ 30 వేల మంది వినియోగదారులకు షాక్ తగలనున్నది. భవిష్యత్తులో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఇన్సెంటివ్ రాదు.
రివర్స్ ఇన్సెంటివ్ రద్దును అధికారులు సమర్ధించుకుంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలోవాట్ సోలార్ విద్యుత్తు రూ.2.5-2.7కే దొరుకుతున్నదని, అంత చౌకగా విద్యుత్తు దొరుకుతున్నప్పుడు రివర్స్ ఇన్సెంటివ్ ఇవ్వలేమని చెప్తున్నారు. భవిష్యత్తులో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు అధికమై రివర్స్ ఇన్సెంటివ్ పొందేవారి సంఖ్య పెరిగితే రివర్స్ ఇన్సెంటివ్ ఇవ్వడం డిస్కంలకు కష్టంగా మారుతుందని అంటున్నారు. రివర్స్ ఇన్సెంటివ్ రద్దయితే డిస్కంలు నిర్ణయించిన ధరకు వినియోగదారులు అదనపు విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. దీంతో రూఫ్ టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఖర్చంతా వినియోగదారుడిపైనే పడుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ వినియోగదారులను ప్రోత్సహించడంలో భాగంగా అదనపు యూనిట్లకు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ప్లాంట్ యజమాని తన సొంత అవసరాలకు వినియోగించుకునే విద్యుత్తును మినహాయించి మిగిలిన యూనిట్లకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. ఉదాహణకు ఒక గృహ యజమాని తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ ద్వారా నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ సొంత అవసరాలకు 200 యూనిట్లను మాత్రమే వినియోగించుకుని, మిగిలిన 50 యూనిట్ల విద్యుత్తును నెట్ మీటరింగ్ ద్వారా డిస్కంకు సరఫరా చేస్తే ప్రతి యూనిట్‌కు డిస్కం రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. దీనినే రివర్స్ ఇన్సెంటివ్ అంటారు. ఇప్పుడు డిస్కంలు ఈ ఇన్సెంటివ్ను రద్దు చేయబోతున్నాయి.