హైదరాబాద్: నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ (Shaik Riyaz) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ నెల 17న దొంగతనం కేసులో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ మరణించిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. అయితే అరెస్టు సమయంలో గాయపడటంతో అతడిని జీజీహెచ్ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిపై దాడి చేసి కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో జీజీహెచ్ దవాఖాన మార్చురీలో సోమవారం అర్ధరాత్రి దాకా రియాజ్ మృతదేహానికి పోస్ట్మార్టం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు.