కోటపల్లి : ప్రాణహిత నది ( Pranahita River ) ప్రవాహం పెరుగుతుంటంతో నది తీరం వెంట సాగు చేస్తున్న పత్తి పంట నీట మునిగిపోతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాణహిత నదిలోకి కొత్త నీరు వచ్చి చేరుతుండగా నది ఒడ్డు పైకి ఎక్కి ప్రవహిస్తుండటం వల్ల వెంచపల్లి, జనగామ( Janagama ) , ఆలుగామ, పుల్లగామ, అన్నారం, సిర్సా తదితర గ్రామాలలో సాగు చేస్తున్న పత్తి పంట నీటిలో మునిగింది.
కోటి ఆశలతో రైతులు పత్తి పంటను సాగు చేయగా మొలక దశలో ఉన్న పత్తి ప్రాణహిత నీటిలో ఉండిపోయింది. క్రమక్రమంగా ప్రాణహిత ప్రవాహం పెరుగుతుండటం వల్ల పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. నది ప్రవాహం పెరుగుతుండగా లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎస్సై రాజేందర్, ఆర్ఐ శ్రీనివాసు పరిశీలించారు. ప్రాణహిత నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని, పడవలలో ప్రయాణం చేయవద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తమకు సమాచారం అందించాలని సూచించారు.