Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Krishna Water | కృష్ణమ్మ చెంతనే ఉన్నప్పటికీ 70 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ చేలకూ నీరివ్వకుండా రేవంత్ సర్కార్ తన అసమర్థతను చాటుకొన్నది. ఏపీ మాత్రం 730 కిలోమీటర్ల దూరానికి అవే జలాలను తరలించుకుపోయింది.
అవకాశం ఉండీ కృష్ణానీళ్లు ఎత్తిపోయని ప్రభుత్వమిది! రెండున్నర ఏండ్లలో రెండున్నర కిలోమీటర్ల కాలువనూ తవ్వలేని పాలనిది! అది నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వకమా? నార్లాపూర్- ఏదుల మధ్య 2.5 కిలోమీటర్ల దూరం కాలువ పూర్తిచేసి ఉంటే, ఇంతటి కరువులో ఐదు రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడేవి కదా? ఎందుకు చేయలేదు? ప్రభుత్వం వద్ద నిధుల్లేవా? నిపుణుల్లేరా? టెక్నాలజీ లేదా? అసలు చిత్తశుద్ధే లేదా? పాలమూరుపై పగబట్టి.. పక్కరాష్ర్టానికి నీళ్లు పారిస్తున్నది ఎందుకు? చేతగాకే పనులు చేపట్టలేదా? గురువుకోసం నీళ్లు వదిలేయాలనే పనులు పూర్తిచేయలేదా?
ఎందరు ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వం కదలకపోవడమే అనుమానాలకు తావిస్తున్నది? ఇది నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వక కుతంత్రమా? ఇటు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులకు శ్రీశైలం నీళ్లు ఎందుకు అందలేదు? అటు 730 కిలోమీటర్ల దూరాన ఉన్న ఏపీలోని కుప్పానికి నీళ్లెట్ల పారినయ్? ఇటు కృష్ణా బేసిన్లోనే కృష్ణానీళ్లు రాలేదెందుకు? అటు పొరుగురాష్ట్రం చివరన ఉన్న పెన్నాబేసిన్‌కు మన నీళ్లు ఎట్ల పరుగులుతీసినయ్? ఇటు పాలమూరు పంపులు గంటల్లోనే మూతపడ్డయెందుకు? అటు ముచ్చుమర్రి మోటర్లు గుక్కతిప్పుకోకుండా ఎత్తిపోసినయ్ ఎందుకు? ఇటు జూరాలలో 250 టీఎంసీల వరద వస్తే రేవంత్ సర్కార్ ఒడిసిపట్టింది కేవలం 23 టీఎంసీలే! మిగిలిన నీళ్లన్నీ కిందనున్న శ్రీశైలానికి వెళ్లిపోయినయ్. అక్కడినుంచి 730 కిలోమీటర్ల దూరంలోని కుప్పం దాకా పారినయ్!
గద్వాల జిల్లాలో ఉన్న ఒక్క జూరాల నింపి ఉంటే, అనేక రిజర్వాయర్లు నిండేవి. వందల చెరువులు మత్తళ్లు దుంకేవి. కాలువలు పారేవి. పొలాలకు నీళ్లు చేరేవి. కరువును తీర్చేవి, రైతుల కన్నీళ్లను తుడిచేవి. కానీ, జరిగిందేమిటి? వరదను వదిలేశారు. కృష్ణాలో మన వాటానూ వదిలేశారు. పాలమూరు రైతుల్ని కరువులోకి నెట్టి, జలదోపిడీకి రేవంత్ సర్కార్ సద్దిగట్టిందీ నిజం! మన ప్రాజెక్టుల్ని పడావుపెట్టి.. ఏపీకి నీళ్లు పారించారనేది సుస్పష్టం! కల్పతరువుని ఖాళీగా ఉంచి.. కుప్పం దాకా కాలువలు పారేలా చేసిందీ వాస్తవం! కేసీఆర్‌పై కోపమో.. పాలమూరుపై పగనో.. కాదిది! మన సాగు గిలాగిలా కొట్టుకుంటుంటే గురువు కోసం సాగిలపడింది రేవంత్ సర్కార్! నోరెండిన మన ఎవుసం గొంతుపిసికి,ఏపీకి నీళ్లు తాపింది రేవంత్ సర్కార్!

(మ్యాకం రవికుమార్ ) హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలే..’ అన్నట్టుగా ఈ కరువు కాలంలో కృష్ణమ్మ కరుణించినా.. రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం తెలంగాణను ఎండబెడుతున్నది. కృష్ణమ్మ చెంతనే ఉన్నప్పటికీ 70 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ చేలకూ నీరివ్వకుండా రేవంత్ సర్కార్ తన అసమర్థతను చాటుకొన్నది. ఏపీ మాత్రం 730 కిలోమీటర్ల దూరానికి అవే జలాలను తరలించుకుపోయింది. లోతుగా చెప్పాలంటే, ఆగస్టు మొదటి వారంలోనే జూరాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇటీవల వరకు స్వల్పంగానైనా వరద కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్లో 250 టీఎంసీలకు పైగా జలాలు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరాయి. ఇంత పెద్దమొత్తంలో జలాలు వస్తే, కాంగ్రెస్ ఎత్తిపోసింది మాత్రం కేవలం 23 టీఎంసీలే. అలా రేవంత్ సర్కార్ విడిచిపెట్టిన జలాలు జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలంలోకి చేరాయి. అలా శ్రీశైలంలోకి నీళ్లు వెళ్లాయో, లేదో.. వెంటనే వాటిని ఒడిసిపట్టుకొన్న ఏపీ.. ఏకంగా 730 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించింది.
జూరాల నీటిని వదిలిపెట్టి..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలో జూరాల ప్రాజెక్టు ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రాజెక్టు ఎడమ కాలువ దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. దీని కింద అమరచింత, ఆత్మకూరు, మదనాపూర్, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో 69 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కుడికాలువ పొడవు 46 కిలోమీటర్లు. ఇది ధరూర్, గద్వాల, ఇటిక్యాల, మనోపాడు మండలాల పరిధిలో మొత్తంగా 35 వేలకుపైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. మొత్తంగా ప్రాజెక్టు కింద సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ప్రాజెక్టును పూర్తిసామర్థ్యంతో నింపితే 10 టీఎంసీల నీటితో ఆ లక్ష ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు.
ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టుకు 250 టీఎంసీల జలాలొచ్చాయి. ప్రభుత్వం వాటిని ఒడిసిపట్టి మళ్లించలేదు. ఎత్తిపోయలేదు. జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టులన్నింటి నిల్వ సామర్థ్యం 26 టీఎంసీలు కాగా, కాంగ్రెస్ మొత్తంగా ఎత్తిపోసింది కేవలం 23 టీఎంసీలే. అవీగాక ఆయా కాలువల ద్వారా చెరువులను నింపుకొనే అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎత్తిపోసుకుందామనుకున్నా నీరు, వరద లేకుండాపోయింది. ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూరాల నీటిని కాంగ్రెస్ సర్కార్ ఒడిసిపట్టుకోకపోవడంతో దాదాపు 227 టీఎంసీలు దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిపోయాయి. .
ఇదీ జూరాల బ్యాక్‌వాటర్ ఆధారంగా భీమా లిఫ్ట్ స్కీమ్ కూడా కృష్ణాపైనే పంచదేవ్ పహాడ్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి నుండి భూత్పూర్ రిజర్వాయర్ 12 కి.మీ. ఇక్కడి నుంచి నర్వ మండలం బెకరపల్లి 18 కి.మీ., ఆత్మకూర్ మండలం పిన్నంచర్ల 45 కి.మీ., అమరచింత మండలం పామిడిపల్లి 40 కి.మీ. ఇక సంగం బండ రిజర్వాయర్ 25 కి.మీ. ఉంటుంది. ఇక ఈ రిజర్వాయర్ నుంచి కృష్ణ మండలం గుడేబల్లూరు 27 కి.మీ., మాగనూరు మండలం అడవి సత్యారం 20 కి.మీ., నర్వ మండలం ఎర్చన్నల్లి 15 కి.మీ. మొత్తంగా ఆ రెండు రిజర్వాయర్ల నుంచి మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాలకు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణానది జలాలు అందాలి. ప్రభుత్వం వీటికి నీటిని అందించడం విఫలమైంది.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సైతం 50కిమీ పరిధిలోనే ఉంటుంది. కానీ అక్కడ ప్రస్తుతం నీటి కొరతనే ఉన్నది. కారణం ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో నీటిని ఎత్తిపోయకపోవడం. ఉదయం పూట కరెంటివ్వడం, రాత్రిపూట నిలుపుదల చేయడం. ఆయా పంపుహౌజుల్లో ఉన్న పంపులను పూర్తిస్థాయిలో రన్ చేయకపోవడం. ఫలితంగా నీటిఎత్తిపోతలు సజావుగా కొనసాగలేదు. జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టులన్నింటి నిల్వ సామర్థ్యం 26టీఎంసీలు కాగా, కాంగ్రెస్ఎత్తిపోసింది కేవలం 23టీఎంసీలే. ఇంకా టీఎంసీలు తక్కువే. అవీగాక ఆయా కాలువల ద్వారా చెరువులను నింపుకునే అవకాశమున్నా కాంగ్రెస్ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎత్తిపోసుకుందామనుకున్నా నీరు, వరద లేకుండా పోయింది. ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
మనకు 13 టీఎంసీలే.. ఏపీకి 60 టీఎంసీలు
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు నుంచి నీటిని ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఈ విషయం ఉమ్మడి పాలకులకు బాగా తెలుసు. అందుకే ఏపీ ప్రాంతానికి నీటిని అందించే హెచ్ఎన్ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి), టీజీపీ (తెలుగు గంగా ప్రాజెక్టు), మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ తదితర ప్రాజెక్టులన్నింటినీ శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగానే నిర్మించారు. వరద వచ్చినా వాడుకోలేని విధంగా ఉన్న జూరాలపైనే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టు అయిన కల్వకుర్తి స్కీమ్‌ను తెలంగాణ కోసం శ్రీశైలంపై ఏర్పాటుచేశారు.
ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉన్న ఆ ఒక్క కల్వకుర్తి ద్వారా సామర్థ్యం మేరకు జలాల తరలింపును చేపట్టిందా? అంటే అదీలేదు. కృష్ణానది నుంచి ఎల్లూరు వరకు 2 కిలోమీటర్లు, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వరకు 26 కిలోమీటర్లు, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వరకు 42.2 కిలోమీటర్లు, సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వరకు 178 కిలోమీటర్లు, చివరి ఆయకట్టు మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి 250 కిలోమీటర్లు. కానీ ప్రభుత్వం ఇక్కడి వరకూ పూర్తిస్థాయిలో పంపులను నడుపనే లేదు. క్రాప్‌హాలిడేను ప్రకటించింది. ఇప్పటికీ జలాలున్నా ఎత్తిపోయడం లేదు. మొత్తంగా శ్రీశైలం నుంచి కల్వకుర్తి ద్వారా తెలంగాణ 13 టీఎంసీలనే వాడుకోగా, ఏపీ మాత్రం శ్రీశైలం నుంచి 60 టీఎంసీలను తరలించుకుపోయింది.
ఏడాది పొడవునా ఏపీకి దన్ను
జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉంటుంది. దానికి ఎగువన కృష్ణా ప్రధాన నదికి తుంగభద్ర, భీమా నదులు కూడా వచ్చి కలుస్తాయి. దీంతో నీటి లభ్యత శ్రీశైలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. అందులో నుంచి దాదాపు 160 టీఎంసీలను ఏడాది పొడవునా వినియోగించుకునే అవకాశం ఉన్నది. జూరాలలో నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేయడంతో వరద దిగువన శ్రీశైలం చేరింది. ప్రాజెక్టుకు మొత్తంగా ఈ సీజన్లో 235 టీఎంసీలు వచ్చాయి. అంతే జలాలను ఏపీ కొల్లగొట్టడం ప్రారంభించింది. వరద ప్రవాహం ప్రారంభంకాగానే జలాల మళ్లింపు ప్రక్రియ చేపట్టింది.
శ్రీశైలం ప్రాజెక్టుపై మల్యాల లిఫ్ట్‌లో భాగంగా హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా కృష్ణా జలాలను ఏపీ మళ్లించింది. ఈ లిఫ్ట్ స్కీమ్ కెనాల్ మొత్తంగా 770 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కెనాల్‌పై 730 కిలోమీటర్ల వద్ద చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. ఈ బ్రాంచ్ కెనాల్ పొడవు 123 కిలోమీటర్లు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలోనూ శ్రీశైలం నుంచి జలాలను అక్కడి వరకు ఏపీ ప్రభుత్వం తరలించింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో జలహారతి కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో కృష్ణాజలాలు దిగువకు ఏకంగా 730 కిలోమీటర్ల ఆవల ఉన్న కుప్పానికి తరలిపోయాయనేది స్పష్టంగా తెలిసిపోతున్నది.
పాలమూరు-రంగారెడ్డిని పడావు పెట్టి..
శ్రీశైలంలో ఇప్పటికీ 57 టీఎంసీల మేర నీళ్లున్నాయి. కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ద్వారా ఇప్పటికైనా 32 టీఎంసీల వరకూ పాలమూరు జిల్లాకు నీటిని పారించుకోవచ్చు. ఈ పథకం కోసం 5 భారీ రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి. నడిపేందుకు పంపులూ రెడీగా ఉన్నాయి. ఒక్క పంపు ఎత్తితేనే నార్లాపూర్‌లో ఇప్పటికే కొన్ని నీళ్లు చేరాయి. పూర్తిగా వాడుకుంటే 6.4 టీఎంసీల దాకా నీళ్లు నింపొచ్చు. కానీ అక్కడి నుంచి ఏదులకు నీళ్లు పారాలంటే మధ్యలో 2.5 కిలోమీటర్ల దూరం కాలువ లేదు. తన మూడేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ దానిని పూర్తిచేయలేకపోయింది. ఫలితంగా శ్రీశైలం నుంచి నార్లాపూర్ దాకా చేరిన నీళ్లు.. ఏదుల రిజర్వాయర్‌కు అందడంలేదు. దీంతో వట్టెం రిజర్వాయర్ వట్టిపోయింది. కరివెనకు కన్నీళ్లే దిక్కయ్యాయి. ఉద్ధండాపూర్కు కృష్ణమ్మ చేరనేలేదు. రేవంత్ సర్కార్ వైఫల్యంతో కృష్ణాజలాలు ఏపీకి తరలిపోగా, కృష్ణమ్మ తలాపునే ఉన్నా.. తెలంగాణ కరువుసీమగా మారింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

