హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : నిత్యం ప్రజల కోసం పరితపించిన ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో మంగళవారం ఎంసీపీఐ(యూ)రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతానికి స్వయం పాలనాధికారం కల్పించాలని ఓంకార్ ఉమ్మడి ఏపీలో నెలల తరబడి చేసిన పోరాటం, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
ఎంసీపీఐ(యూ)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ.. ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నదని, ఇందుకు ప్రధాన కారణం సామ్రాజ్యవాదం, కార్పొరేట్, పెట్టుబడిదారీ విధానాలే అని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ.. ఓంకార్ శతజయంతిని పురస్కరించుకొని 2026 మే 12 వరకు వార్షికోత్సవ సభలు నిర్వహించి ఓంకార్ ప్రజా ఉద్యమాన్ని ప్రచారం చేయనున్నట్టు తెలిపారు.
ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, అధ్యక్షుడిగా వల్లెపు ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వనం సుధాకర్, కోశాధికారిగా గోనె కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా గాదగోని రవి, వసుల మట్టయ్య, కుంభం సుకన్య, హంసారెడ్డిని నియమించినట్టు వెల్లడించారు.