హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గురువారం విడుదలవుతున్న ‘ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపుపై పునఃసమీక్షించాలని, పెంచిన ధరలను ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును సవాలు చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. ‘ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపునకు చట్టవిరుద్ధంగా మోమో జారీ చేశారని, టికెట్ ధరల పెంపునకు ఎలాంటి కారణాలు వివరించలేదని, ఆ సినిమా బడ్జెట్ వివరాలను వెల్లడించలేదని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ.. ఇటీవల వెలువడిన జీవో ప్రకారమే మెమో జారీ అయిందని, దీనిపై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుకు వీల్లేదని పేర్కొన్నారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. టికెట్ ధరల పెంపును కోరుకునేవారు నిబంధనల ప్రకారం సినిమా విడుదలకు 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని, అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం ఆ దరఖాస్తును ప్రజల ముందుంచాలని తెలిపారు.