హైదరబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో ఉన్నదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనక గురుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లో దివంగత ఎంపీ ఎస్ జైపాల్‌రెడ్డి మెమోరియల్, మంథన్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’ సదస్సులో ఆమె నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావుతో కలిసి ముఖ్యవక్తగా ప్రసంగించారు.
రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, అవకాశాలు, భావప్రకటనా స్వేచ్ఛ, ఉపాధి అవకాశాలు యువత జీవితాల్లో ఎంతవరకు అమలవుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని మేనక గురుస్వామి స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో భిన్నాభిప్రాయాలపై విసృ్తత చర్చలు జరిగేవని, ప్రస్తుతం విమర్శలకు స్థానం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రతిపక్షం ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతే వీధి పోరాటాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాథమిక హకులను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి రాకూడదని, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు.