వేములవాడ, జూన్ 15: ‘నా కొడుకు ఆత్మహత్యకు రాజన్న ఆలయ అధికారులే కారణమని, వారి వేధింపులతోనే ప్రాణం తీసుకున్నాడని’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యో గి ఓంకార్ (32) తల్లి పెంట లక్ష్మి ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బంధువులు, కాలనీవాసులతో కలిసి ఆదివారం రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేసి మాట్లాడారు. రాజన్న ఆలయం లో తన కొడుకు ఉద్యోగిగా పనిచేసేవాడని తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలోని ఇద్దరు అధికారులు తన కొడుకుతో వారి సొంత పనులు చేయించుకున్నారని, 15రోజులపాటు విధులకు హాజరు కావడం లేదంటూ గైర్హాజరు వేస్తామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని వేధింపులకు పాల్పడ్డారని, క్షమాపణ పత్రం రాయించుకోవడంతో తీవ్రమనస్తాపం చెంది గత నెల 30న ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని పరిపాలన కార్యాలయం ఏఈవో శ్రవణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.