Mastan Sai | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సినీ హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసు ఆద్యంతం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతున్నది. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన వందల మంది మహిళల నగ్న వీడియోల మూలాలు సైతం చివరకు డ్రగ్స్ వద్దకే చేరాయి. ఈ క్రమంలో మంగళవారం రెండో హార్డ్‌డిస్క్ తెరపైకి వచ్చింది. డ్రగ్స్ విక్రేత మస్తాన్‌సాయిని అరెస్టు చేయడంతో స్వేచ్ఛగా తన ఇంట్లోకి వెళ్లిన లావణ్యకు ఈ హార్డ్‌డిస్క్‌తో ఓ ఫోన్ కూడా దొరికినట్టు తెలిసింది. వాటిని లావణ్య తరఫు వ్యక్తి నార్సింగి పోలీసులకు అందించినట్టు సమాచారం. ఆ హార్డ్‌డిస్క్‌లోనూ మహిళల నగ్న వీడియోలు, ఫోన్లో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉన్నట్టు తెలిసింది. మస్తాన్‌సాయి వందల మంది మహిళలను బుట్టలో వేసుకొని నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు లావణ్య ఇటీవల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ హార్డ్‌డిస్క్‌లను ఎఫ్ఎస్ఎల్కు పంపి, నిజాలను నిర్ధారించుకోవాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
రాజ్‌తరుణ్ తనను మోసగించినట్టు లావణ్య ఏడాది కిందట నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వాతి, శేఖర్ బాషా సహా మరికొంత మంది తెరపైకి వచ్చారు. ఇప్పుడు నగ్న వీడియోలు వెలుగులోకి రావడం వందల మంది మహిళలకు ఆందోళన కలిగిస్తున్నది. మస్తాన్‌సాయి చిత్రీకరించిన నగ్న వీడియోల్లో అమాయక మహిళలతోపాటు భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సంపన్న వర్గాల మహిళలు కూడా ఉన్నట్టు లావణ్య ఈ నెల 2న నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్ముందు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది.
అందమైన విల్లాలు, కొత్త మోడల్ వాహనాలతో చూడగానే సంపన్న వర్గానికి చెందినవాడుగా కనిపించే మస్తాన్‌సాయి.. ప్రధానంగా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిచూపే సంపన్న వర్గాల మహిళలకు, విదేశాల్లో చదువుకొని వచ్చిన యువతులకు గాలం వేసేవాడని వేసుకునేవాడని తెలిసింది. వారు తన వలలో పడగానే నీళ్లు, కూల్డ్రింకులు, చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ అందించేవాడని, ఆపై వారిని లైంగికంగా లోబర్చుకొని, ముందే సిద్ధం చేసుకున్న ల్యాప్‌టాప్ ద్వారా ఆ దృశ్యాలను వీడియోలో బంధించేవాడని, అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసి ఇతరులకు పంపేవాడని లావణ్య సన్నిహితులు చెప్తున్నారు.