హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : జన్వాడ వద్ద ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన కేసులో రాజ్‌పాకాల బుధవారం మోకిల పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 గంట ల సమయంలో మోకిల ఠాణాలోకి వెళ్లిన రాజ్‌పాకాలను నార్సింగి ఏసీపీ వెంకటరమణగౌడ్ ఆధ్వర్యంలో రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. మధ్య లో పోలీసులు రాజ్‌పాకాలను పార్టీ జరిగిన జన్వాడ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గంటపాటు విచారణ జరిపిన పోలీసులు తీరిగి మోకిల స్టేషన్‌కు తీసుకువచ్చి రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్‌పాకాల విచారణ పూర్తయిందని వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ప్రస్తు తం ఎలాంటి విషయాలు మీడియా కు వెల్లడించలేమని, అవసరమైతే మరోసారి రాజ్‌పాకాలను విచారణకు పిలుస్తామని చెప్పారు.
పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని రాజ్‌పాకాల తెలిపారు. వారికి పూర్తిగా సహకరించానని అన్నారు. తమ ఇంట్లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీనే అని చెప్పారు. విజయ్ మద్దూరి పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఎవరికో పాజిటివ్ వస్తే తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ‘ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి పార్టీ చేసుకోకూడదా…? రాజకీయ దురుద్దేశంతోనే కావాలని ఇష్యూను పెద్దగా చిత్రీకరిస్తున్నారు’ అని మండిపడ్డారు.