TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించింది.