జనగామ, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : చెక్కతీగల తోలుబొమ్మలాట కళాకారుడు జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన మోతె జగన్నాథం (70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. అరుదైన.. అంతరించి పోతున్న కళారూపాలకు జీవం పోస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, లక్నో, మేఘాలయాలో పలు ప్రదర్శనలతో చెక్క బొమ్మలాటకు విశేష ప్రాచుర్యం కల్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అం దించింది. ‘బొమ్మలోల్లు’ అని ఆప్యాయంగా పిలుచుకునే మోతె జగన్నాథం, చెక తీగల తోలుబొమ్మలాట ద్వారా శతాబ్దాల నాటి కథా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి అంకితమైన కళాకారుల బృందానికి నాయకత్వం వహించాడు. ఆయన ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, రామదాసు కథలకు ప్రాణం పోశాయి. మోతె జగన్నాథం ఆకస్మిక మృతి కళకు తీరని లోటని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ సంతాపం ప్రకటించారు.