హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, క్రీడా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై విదేశాల్లో ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన క్రీడలు, పర్యాటక శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు.
ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలకు స్థలాలను గుర్తించి వాటి అభివృద్ధికి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని ఖాళీ స్థలాలు, లీజ్‌లకు ఇచ్చిన స్థలాలతోపాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలోని క్రీడా మైదానాలను గూగుల్ మ్యాప్‌లకు అనుసంధానించి సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
కోర్టు వివాదాల్లో ఉన్న క్రీడామైదానాలపై స్టాండింగ్ కౌన్సిల్‌తో చర్చించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా కోర్టు వివాదాలను పరిషరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో క్రీడలు, పర్యాటకశాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, క్రీడలు, పర్యాటక శాఖ జాయింట్ సెక్రటరీ రమేశ్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.