హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐ తిరుమలి అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో బీసీలు 53 శాతం ఉన్నట్టు తేల్చిందని, కానీ ఈ సర్వేలో ఏడు శాతం తగ్గడమేమిటని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో అగ్రకులాలవారు ఏడు శాతం ఎలా పెరిగారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఉన్నా.. బీసీలకు 42 శాతం ఎలా కల్పించాలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య ఓ ముసాయిదాను రూపొందించి సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసినట్టు తెలిపారు. దానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. కులగణన సర్వేలో లోపాలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆయన గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రొఫెసర్ తిరుమలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కులగణన క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా నియమించడం సరికాదు. జనాభా లెక్కలు, కులగణన డాటాపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని ప్రభుత్వం నియమిస్తే సర్వే పారదర్శకంగా జరిగేది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నియమించిన ‘శ్రీ కృష్ణ కమిటీ’కి క్రెడిబులిటీ ఉంది. అలాంటి కమిటీని ప్రభుత్వం నియమించాల్సింది. ప్రభుత్వం కలెక్టర్లతో సర్వే చేయించింది. రాష్ట్రంలో సృష్టించిన ధనం ఎవరి చేతిలో ఉన్నదో సర్వే తేల్చాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేశాం. అన్ని రంగాల్లో ఏ వర్గం వారు ఎంత అభివృద్ధి చెందారో లెక్క తేలాలి. కానీ ప్రభుత్వం మా డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది.
నమస్తే తెలంగాణ: బీసీల సంఖ్య కావాలనే తగ్గించారనే వాదన వినిపిస్తున్నది. దీనిపై మీరేమంటారు?
తిరుమలి: భారతీయులు అంతా ఒకటే అనే భావన సర్వేలో కనిపించలేదు. ఆదాయంలో, అభివృద్ధిలో వాటా లేని వారు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. అట్టడుగుస్థాయిలో ఉన్న వర్గాలకు సర్వేలో చోటు దక్కలేదు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని తేల్చింది. కానీ కులగణన సర్వేలో బీసీలు 7 శాతం తగ్గినట్టు ప్రభుత్వం తేల్చడం ఏంటి? 10 శాతం ఉన్న అగ్ర కులాలు వారు 17 శాతం ఎలా పెరిగారు? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
నమస్తే తెలంగాణ: ఉపకులాల వారీగా లెక్కలు చూపకపోవడాన్ని ఏమంటారు?
తిరుమలి: కులగణన సర్వేలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల బతుకుచిత్రం బయటకు తీయలేదు. ముస్లింలను కలిపి బీసీల జనాభా 56 శాతం అనడం సరికాదు. ప్రభుత్వం డాటాను కరెక్షన్ చేసుకోవాలి. సంచార జాతుల వారికి స్థిర నివాసం లేదు. 6 నుంచి 7 సంచార జాతుల వారు కులాల జాబితాలోకి వచ్చారు. వారి లెక్కలు తేలాల్సి ఉంది. గత 14 ఏండ్లలో రాష్ట్రంలో ఏపీకి చెందిన అనేక మంది మైగ్రేట్ అయ్యారు. వారి పరిస్థితి ఏంటి? అగ్ర కులాలలో ఎవరి జనాభా ఎంత అన్నది కూడా సర్వేలో చూపలేదు. కులగణన లెక్కలు బయటపెట్టడంలో సర్కారు ఎందుకు జాప్యం చేస్తున్నదో సమాధానం చెప్పాలి. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపింది.
నమస్తే తెలంగాణ: ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి?
తిరుమలి: బీసీలకు ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కులగణన సర్వేలో లోటుపాట్లను సవరించుకుని సర్వేను మరింత శాస్త్రీయంగా చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలలోపే 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. ఈశ్వరయ్య డ్రాఫ్ట్ యాక్ట్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని బీసీ రిజర్వేషన్లకు వెంటనే చట్టం చేయాలి. రిజర్వేషన్లు కల్పించే విషయంలో మేధావులు, విద్యావేత్తల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.