Gurukula Schools | హైదరాబాద్, మే16 (నమస్తే తెలంగాణ): బాలికల గురుకులాల్లో ఆయా ప్రిన్సిపాల్స్‌దే బాధ్యత అని, విధులు నిర్వర్తించే నాన్‌టీచింగ్ స్టాఫ్ సంస్థలోని బాలికలతో మాట్లాడకూడదని ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. ఈ మేరకు గురుకుల ప్రిన్సిపాల్స్‌కు ఆమె శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. పార్ట్‌టైం ఉద్యోగులెవరూ ఇకపై గురుకులాల్లో ఉండకూడదని, కేవలం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికపై మాత్రమే ఉంటారని తెలిపారు.
గురుకులాల్లో రెగ్యులర్, నాన్ రెగ్యులర్ పురుష సిబ్బంది ఉండకూడదని, ఉన్నట్టు గమనిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఉన్నతాధికారుల అనుమతితో జూనియర్ అసిస్టెంట్, ఐసీటీ, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు బాలికల గురుకులాల్లో పనిచేయవచ్చునని పేర్కొన్నారు. అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దాటి రావొద్దని, ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకే గురుకులాల్లో ఉండాలని స్పష్టంచేశారు. గురుకులాల్లో నైట్డ్యూటీల్లో మహిళా సిబ్బంది ఒకరు కచ్చితంగా ఉండాలని ఆమె వెల్లడించారు. ఆయా నిబంధనలను అమలు చేస్తానని, ఉల్లంఘనలకు పాల్పడితే బాధ్యత వహిస్తానని ప్రిన్సిపాల్స్ హామీ పత్రం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.