e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home Top Slides గర్భధారణకు సమయం కాదు

గర్భధారణకు సమయం కాదు

గర్భధారణకు సమయం కాదు
  • గర్భిణులకు వ్యాక్సిన్‌తో ప్రమాదం ఉండదు
  • తల్లీబిడ్డల క్షేమంపై కుటుంబసభ్యులు జాగ్రత్తపడాలి
  • తల్లికి పాజిటివ్‌ వచ్చినా బిడ్డకు పాలు ఇవ్వవచ్చు
  • ప్రత్యేక ఇంటర్వ్యూలో గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జయశ్రీ

ప్రస్తుతం ఎవరిని కదిలించినా కరోనా గురించే మాట్లాడుతున్నారు. మొదటి దశ కంటే రెండో దశ వ్యాప్తి ప్రతి ఒక్కరినీ కలవర పెడుతుతున్నది. ముఖ్యంగా గర్భిణుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి చర్చ ప్రతి ఇంట్లోనూ కొనసాగుతున్నది. గర్భం దాల్చాలా? వద్దా? గర్భిణులకు మహమ్మారి సోకితే శిశువులకు ప్రమాదమా? వ్యాక్సిన్‌ వేసుకుంటే ప్రమాదమా? తదితర అంశాలపై కోఠిలోని ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జయశ్రీ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు ఎలా ఉండాలి?
వైరస్‌ బారిన పడకుండా గర్భిణులు పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటేనే మంచిది. షాపింగ్‌, విందులు, ప్రయాణాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. నెలలు నిండినవారు దవాఖానకు చెకప్‌ కోసం తప్ప అనవసరంగా బయటకు వెళ్లకూడదు. ప్రస్తుత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఫోన్‌ ద్వారా వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడితే మంచిది.

పాజిటివ్‌ వస్తే బిడ్డపై ప్రభావం ఉంటుందా?
గర్భిణులకు కరోనా పాజిటివ్‌ వస్తే.. అది బిడ్డకు సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనాల ప్రకారం కరోనా సోకిన 95 శాతం మంది గర్భిణుల ద్వారా శిశువులకు ఆ వ్యాధి సంక్రమించలేదని తేలింది. కడుపులో పిండం చుట్టూ వలయం ఏర్పడి ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు, శ్వాసకోశాల్లో చేరి ఇబ్బంది పెట్టే వైరస్‌ బిడ్డవరకు చేరే అవకాశాలు చాలాతక్కువ. కరోనాతోపాటు బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, ఇతర వ్యాధుల తీవ్రత ఉన్నవారిలో మాత్రం సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏమైనా ఇబ్బందా?
గర్భిణులు, బాలింతలు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. గతంలో మనమంతా గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోకూడదనే అనుకున్నాం. అయితే అమెరికాలో జరిపిన పలు పరిశోధనల్లో వ్యాక్సిన్‌ వల్ల గర్భిణుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తేలింది. మన రాష్ట్రంలో దీనిపై పరిశోధనలు జరగాల్సి ఉన్నది. గర్భిణులు వేసుకొనే టీటీ, టీడాప్‌, వంటి వ్యాక్సిన్లు వేసుకుంటూనే వారం రోజులు గ్యాప్‌ తీసుకొని కొవిడ్‌ టీకా వేయించుకుంటే మంచిది.

పాజిటివ్‌ వస్తే చికిత్స ఎలా?
డెలివరీ తేదీ దగ్గర పడినవారిని నిర్ణీత సమయానికి ముందుగా దవాఖానలో చేర్చుకొని కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిని కొవిడ్‌ ప్రత్యేక సేవలు అందించే దవాఖానకు తరలించి అక్కడే డెలివరీ జరిగేలా చూస్తారు.

ప్రభుత్వం ఏంచర్యలు చేపట్టింది?
రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విభాగాలు ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాయి. గర్భిణుల వివరాలను నమోదుచేసుకొని సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడంతోపాటు వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. డెలివరీ కోసం వచ్చినవారిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే కొవిడ్‌ ప్రత్యేక విభాగాలున్న దవాఖానల్లోనే డెలివరీలు నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.

తల్లికి కరోనా సోకితే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
కరోనా సోకినప్పటికీ నవజాత శిశువుకు తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లిపాల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డకు యాంటీబాడీస్‌ డెవలప్‌ అవుతాయి. తద్వారా ఎటువంటి వైరస్‌లనైనా ఎదుర్కొనే శక్తి బిడ్డ శరీరంలోకి చేరుతుంది.

కొత్తగా పెండ్లి అయినవారు గర్భందాల్చడం మంచిదా?
బర్త్‌ ప్లాన్‌ అనేది ముఖ్యం. ప్రస్తుత కరోనా విజృంభణ నేపథ్యంలో కొత్తగా పెండ్లి అయినవారు గర్భం దాల్చకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో బర్త్‌ కంట్రోల్‌ ప్లానింగ్‌ చేసుకోవాలని, గర్భం రాకుండా ప్రత్యామ్నాయ విధానాలు పాటించాలని జంటలకు సూచిస్తున్నా..

గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
శరీరంలో ఇమ్యునిటీ పెంచేలా ఆకు కూరలు, పండ్లు, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకుంటూ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు 8 గంటలకు పైగా నిద్ర పోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి…

ఇంజినీరింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులు

ఆక్సిజన్‌ వినియోగం పైపైకి..

కాలుష్యం నుంచి భూమిని కాపాడాలి

Advertisement
గర్భధారణకు సమయం కాదు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement