సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి సమాజ హితంకోరి విద్యాసంస్థల ఏర్పాటుకోసం నాడు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనకి తీసుకొన్నది. ఆ భూమి కేటాయింపును రద్దు చేస్తూ సర్కార్ తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ భూమిని అదే సొసైటీకి తిరిగి అప్పజెప్పాలి’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ మంత్రులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ చేసే పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఆ భూములను తిరిగి ఇవ్వకపోతే, రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సొసైటీకి తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ భవన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన వెంకట్రామ్రెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అన్నికులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలన్న కేసీఆర్ సంకల్పంలో భాగంగా.. రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ వద్ద ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి 15 ఎకరాల స్థలాన్ని, రూ.10 కోట్ల నగదును కేటాయించారని గుర్తుచేశారు. గతంలో ఈ రాష్ర్టాన్ని పాలించిన ఎందరో రెడ్డి ముఖ్యమంత్రులెవరూ రెడ్డి సామాజిక వర్గానికి చేయని గొప్ప పనిని కేసీఆర్ మాత్రమే చేసి చూయించారని చెప్పారు.
కేసీఆర్ ఇచ్చిననాడు రూ.150 కోట్ల విలువైన ఆ భూమి ప్రస్తుతం సుమారు రూ.1,500 కోట్ల విలువకు చేరుకున్నదని వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నాడు కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే భవన నిర్మాణం స్లాబు స్థాయికి, ప్రహరీ నిర్మాణం పూర్తయిందని వివరించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతో ఆ సొసైటీకి ఇచ్చిన భూమిని లాకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. న్యాయం అడిగేందుకు వెళ్లిన సొసైటీ సభ్యులను సీఎం బెదిరించడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే, భవిష్యత్తులో ఇతర కులాలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల స్థలాలకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జీవితం నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తాను ఒకరే పైకి రావడం గొప్పత నం కాదని, తనతో పాటు మరో పది మం దిని పైకి తీసుకురావడమే నిజమైన గొప్పతనమని పేర్కొన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తన కాలంలోనే విద్య ప్రాధాన్యా న్ని గుర్తించి విద్యార్థులు, ముఖ్యం గా ఆడపిల్లల కోసం హాస్టల్ ఏర్పాటు చేయ డం ఆయ న దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. సిద్దిపేట రెడ్డి సంఘం ఫంక్షన్‌హా ల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలకు కాకుం డా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వినియోగించాలని సూచించారు.
మాతృ వియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు కే విరాహత్ అ లీ కుటుంబాన్ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లో ర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు. గజ్వే ల్లో విరాహత్ అలీ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్ర తాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.