హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అధికార, రాజకీయ ప్రముఖులకు కూడా బీఎల్వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌కు బూత్‌లెవల్ అధికారులు (బీఎల్వోలు) నోటీసు జారీ చేశారు. ‘సర్’లో భాగంగా పొన్నం ప్రభాకర్ ఓటరు వివరాలను పరిశీలించిన బీఎల్వోలు జాబితాలో ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదైనట్టు గుర్తించారు. దీంతో ఆ వివరాలను సరిచేయాల్సిందిగా నోటీసు జారీచేశారు.
నోటీసు అందుకున్న వెంటనే మంత్రి పొన్నం స్పందించారు. తన తండ్రి పేరును సరిగ్గా నమోదు చేయాలని కోరుతూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్థానిక బీఎల్వోకు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇంటి పేరు విషయంలో తలెత్తిన పొరపాట్లపై అధికారులు వివరణ కోరారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం వివరాలు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే, వీఐపీలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులకు నోటీసులు అందించకుండా వారి ఇండ్ల వద్దకే వెళ్లి పొరపాట్లు, జాబితాలో తప్పులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలకు సమీకరించాలని బీఎల్వోలకు ఆదేశాలిచ్చినట్టు సీఈవో వర్గాలు వెల్లడించాయి.