హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విద్యా, ఉద్యోగావకాశాల్లో మాలలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న జీవో-99ను తక్షణమే రద్దు చేయాలని, రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాల మహానాడు, మాల సంఘాల పిలుపుమేరకు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాదిమంది మాల సామాజికవర్గ ప్రజలు, నాయకులు బారికేడ్లను దాటుకొని సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో జాతీయ అధికార ప్రతినిధి దార సత్యం తీవ్రంగా గాయపడటంతో ఆయనను దవాఖానకు తరలించారు.
పిల్లి సుధాకర్తోపాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముషీరాబాద్, ఇతర పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానంలో మొదటి 20 పాయింట్లలో కనీసం 2 పాయింట్లను మాలలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రోస్టర్ సవరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. పోలీసులు కనీసం మహిళను చూడకుండా వారిపై గూండాల్లా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అంబేదర్ విగ్రహాల ముందు నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చారు.