హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు MI-17 హెలికాప్టర్లో బయల్దేరి, 2:35 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 గంటల నుంచి 4:15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ నూతన లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ ఆశ్రమానికి మోదీ చేరుకుని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోదీ పాల్గొంటారు. రాత్రి 8:25 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించారు. యాగశాల ముందు పాకలో సగభాగం తొలగించాలని భద్రతా సిబ్బంది నిర్వాహకులకు సూచించింది. దీంతో యాగ క్రతువును భక్తులు వీక్షించి వెళ్లాలని చిన్నజీయర్ స్వామి సూచించారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్లో గురువారం ఉదయం సమావేశమై సమీక్షించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. వేదికల వద్ద తగు వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. వీవీఐపీ సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేపట్టాలని, కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో సన్నద్ధం చేయాలని సీఎస్ సూచించారు.